ఓబద్యా
1
1 ఇది దర్శనం✽లో ఓబద్యాకు ప్రభువైన యెహోవా ఎదోంప్రజను గురించి చెప్పిన విషయం. యెహోవానుంచి వచ్చిన సమాచారం మాకు వినబడింది. “లెండి! ఎదోం✽మీద యుద్ధం చేద్దాం పదండి.” అని చెప్పడానికి ఇతర జనాల దగ్గరికి ఒక దూతను పంపడం జరిగింది.2 ✽యెహోవా ఇలా అంటున్నాడు: “ఇతర జనాలమధ్య నిన్ను అల్ప జనంగా చేస్తాను. నీవు గొప్ప తిరస్కారానికి గురి అవుతావు. 3 నీవు కొండల సందుల్లో✽ నివాసం చేస్తున్నావు, ఎత్తయిన స్థలాలమీద కాపురమేర్పరచుకొన్నావు. ‘నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడు?’ అనుకొంటున్నావు. నీ హృదయ గర్వం వల్ల నీవు మోసపోయావు. 4 అయితే గరుడపక్షి గూడంత ఎత్తుగా నీవు నివాసం చేసుకున్నా, నక్షత్రాలలో దాన్ని కట్టుకొన్నా, అక్కడనుంచి నేను నిన్ను క్రింద పడవేస్తాను.
5 ✽“నీమీదికి దొంగలు వస్తే, రాత్రివేళ దోపిడీదారులు వస్తే, తమకు కావలసినంతమట్టుకే దోచుకొంటారు గదా. ద్రాక్ష పండ్లను✽ పోగు చేసేవారు నీ తోటలకు వస్తే కొన్ని పండ్లు విడిచిపోతారు గదా. అయితే నీకు రాబోయే నాశనం ఎంత ఘోరం! 6 ఏశావు వంశంవారిని పూర్తిగా దోచుకోవడం జరుగుతుంది. వారు దాచిపెట్టిన ధనమంతా దోపిడీ అవుతుంది. 7 ✽నీతో సంధి చేసినవారు నిన్ను తమ సరిహద్దువరకు పంపివేస్తారు. నీతో సమాధానంగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి గెలుస్తారు. నీ ఆహారం తిన్నవారు నిన్ను పట్టుకోవడానికి వల వేస్తారు. ఎదోంకు తెలివి లేదు. 8 ✽ఆ కాలంలో ఏశావు✽ పర్వతాలలో తెలివి లేకుండా చేస్తాను. ఎదోంలో ఉన్న జ్ఞానులను నాశనం✽ చేస్తానన్నమాట. ఇది యెహోవా వాక్కు. 9 ✽తేమాను! నీ బలాఢ్యులకు భయం వేస్తుంది. అందుచేత ఏశావు కొండలలో నివాసులందరినీ సంహారంలో కూల్చడం జరుగుతుంది.
10 ✽“నీ సోదరులైన యాకోబు✽ వంశీయులమీద దౌర్జన్యం చేశావు గనుక నిన్ను అవమానం ఆవరిస్తుంది. నీవు శాశ్వత✽ వినాశానికి గురి అవుతావు. 11 విదేశీయులు వారి ఆస్తిపాస్తులను పట్టుకుపోయిన రోజున, పరాయివారు వారి ద్వారాలగుండా చొరబడి జెరుసలంమీద చీట్లు వేసిన రోజున నీవు ఎదురుగా నిలుచుండి అలా చేసినవారిలో ఒకడిలాగా✽ ఉన్నావు. 12 ✽నీ సోదరులు దురవస్థపడ్డ రోజున నీవు దాన్ని చూచి ఆనందించడం అక్రమం. యూదావారి నాశన దినాన వారి స్థితి చూచి సంతోషించడం అక్రమం. వారి బాధకాలంలో నీవు గొప్పలు చెప్పుకోవడం అక్రమం. 13 నీవు నా ప్రజల విపత్తు రోజున వారి ద్వారాలగుండా చొరబడడం, ఆ విపత్తు రోజున వారి ఆపద చూచి సంతోషించడం, ఆ విపత్తు రోజున వారి ఆస్తిపాస్తులను పట్టుకోవడం✽ అక్రమం. 14 ✽వారిలో తప్పించుకు పోయేవారిని హతమార్చడానికి అడ్డత్రోవల్లో నీవు నిలబడడం అక్రమం. ఆ బాధకాలంలో వారిలో మిగిలేవారిని శత్రువుల వశం చేయడం అక్రమం.
15 “యెహోవా దినం✽ ఆసన్నమైంది. అది అన్ని జనాలమీదికీ వస్తుంది. నీవు చేసినట్టే నీకు చేయడం జరుగుతుంది. నీ క్రియల ఫలం నీ నెత్తిమీదికి✽ వస్తుంది. 16 మీరు నా పవిత్ర పర్వతం✽మీద త్రాగేవిధంగా జనాలన్నీ ఎడతెగకుండా త్రాగుతారు. త్రాగి ఎన్నడూ ఉనికి లేనివారిలాగా ఉంటారు. 17 ✝అయితే సీయోను కొండమీద తప్పించుకొన్న వారు నివసిస్తారు. అది పవిత్రమైన కొండగా ఉంటుంది. యాకోబు వంశంవారు తమ వారసత్వం✽ పొందుతారు. 18 ✽యాకోబు వంశీయులు జ్వాలలాగా, యోసేపు కుటుంబంవారు మంటలాగా ఉంటారు. ఏశావు వంశంవారు ఎండుగడ్డిలాగా ఉంటారు. వారిచేత నిప్పు తగిలి, ఏశావు వంశం దహించుకుపోతుంది. ఏశావు వంశంలో ఎవరూ తప్పించుకోరు. యెహోవా మాట ఇచ్చాడు.”
19 ✽“యూదా దక్షిణ ప్రాంతంనుంచి కొందరు వచ్చి ఏశావు పర్వతాలను స్వాధీనం చేసుకొంటారు. మైదానాల ప్రాంతం నుంచి కొందరు వెళ్ళి ఫిలిష్తీయవారి✽ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఎఫ్రాయింగోత్రానికీ షోమ్రోనుకూ చెందిన భూములను కూడా వారు స్వాధీనం చేసుకుంటారు. బెన్యామీను గోత్రికులు గిలాదు✽ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటారు. 20 ఇస్రాయేల్ వారి సమూహంలో బందీలుగా దేశాంతరం పోయినవారు సారెపతు✽ వరకు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. జెరుసలంనుంచి బందీలుగా సెపారాద్‌కు పోయినవారు యూదా దక్షిణ ప్రాంతం పట్టణాలను స్వాధీనం చేసుకుంటారు. 21 ✽ఏశావు పర్వతాలను పరిపాలించడానికి రక్షకులు సీయోను కొండెక్కుతారు. అప్పుడు రాజ్యం యెహోవాదే అవుతుంది.”