9
1 ఒకసారి దావీదు ఇలా అడిగాడు: “యోనాతాను కోసం✽ నేను దయ చూపడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలివున్నారా?”2 మునుపు సౌలు కుటుంబానికి సీబా✽ అనేవాడు పరిచారకుడు. వారు అతణ్ణి దావీదు దగ్గరికి పిలవనంపించారు. అతణ్ణి చూచి రాజు “నీవు సీబావా?” అని అడిగాడు. అతడు “నీ దాసుణ్ణి” అని జవాబిచ్చాడు.
3 రాజు “దేవుని మూలంగా నేను దయ చూపడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలివున్నారా?” అని అడిగినప్పుడు సీబా “యోనాతాను కొడుకు ఒకడు ఉన్నాడు. అతడు కుంటికాళ్ళు✽ గలవాడు” అని రాజుతో చెప్పాడు.
4 “అతడు ఎక్కడ ఉన్నాడు?” అని రాజు అడిగాడు. అందుకు సీబా “అతడు లోదెబారు✽లో అమ్మీయేల్ కొడుకు మాకీరు✽ ఇంట్లో ఉన్నాడు” అని సమాధానం చెప్పాడు.
5 అప్పుడు దావీదురాజు మనుషులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేల్ కొడుకు మాకీరు ఇంటినుంచి అతణ్ణి రప్పించాడు. 6 సౌలు మనుమడూ యోనాతాను కొడుకూ అయిన మెఫీబోషెతు దావీదుదగ్గరికి వచ్చి ముఖం వంచి సాష్టాంగపడ్డాడు. దావీదు “మెఫీబోషెతు!” అన్నాడు. అతడు “చిత్తం. నీ దాసుణ్ణి” అని మారు పలికాడు.
7 దావీదు అతడితో అన్నాడు: “నీవు భయపడవద్దు✽. నీ తండ్రి యోనాతాను కోసం నేను నీమీద దయ✽ చూపితీరుతాను. నీ తాత సౌలు భూమి అంతా నీకు మళ్ళీ ఇప్పిస్తాను. నీవు ఎప్పటికీ నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు.”
8 ✽అందుకు మెఫీబోషెతు అభివందనం చేసి “నా పట్ల నీవు దయ చూపడానికి నీ దాసుడైన నేను ఎంతటివాణ్ణి? నేను చచ్చిన కుక్కలాంటివాణ్ణి” అని చెప్పాడు.
9 అప్పుడు దావీదురాజు సౌలు పరిచారకుడైన సీబాను పిలువనంపించి ఇలా అన్నాడు: “సౌలుకూ అతని కుటుంబానికీ చెందిన సొత్తంతా నీ యజమాని మనుమడికి ఇప్పించాను. 10 నీవు, నీ కొడుకులు, నీ పనివాళ్ళు అతడికోసం ఆ భూమిని సాగు చేయాలి. నీ యజమాని మనుమడి పోషణకోసం నీవు ఆ భూమి పంటలు తేవాలి. అయినా నీ యజమాని మనుమడైన మెఫీబోషెతు ఎప్పటికీ నా బల్ల దగ్గరే భోజనం చేస్తాడు.” (సీబాకు పదిహేనుమంది కొడుకులు, ఇరవైమంది పనివాళ్ళు ఉన్నారు.)
11 సీబా “నా యజమాని అయిన రాజు తన దాసుడైన నాకు ఆజ్ఞాపించినట్టే అంతా చేస్తాను” అని రాజుతో చెప్పాడు.
అప్పటినుంచి మెఫీబోషెతు రాకుమారుల్లో✽ ఒకడులాగా రాజు బల్లదగ్గర భోజనం చేస్తూ వచ్చాడు. 12 మెఫీబోషెతుకు చిన్న కొడుకు ఉన్నాడు. అతడి పేరు మీకా, సీబా ఇంటిలో కాపురముంటున్న వాళ్ళంతా మెఫీబోషెతుకు సేవకులుగా ఉన్నారు. 13 మెఫీబోషెతు జెరుసలంలో కాపురముంటూ, ఎప్పటికి రాజు బల్లదగ్గర భోజనం చేశాడు. అతడి కాళ్ళు రెండూ కుంటివి.